Pages

Subscribe:

Monday 18 July 2011

దేవుడున్నాడా?-1

"దేవుడున్నాడా?"- అనేకుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది. తర్క శాస్త్రం ప్రకారం ఎదైనా విషయం విశ్లేషనాత్మకంగా వివరింపబడితే దానిని అంగీకరించవచ్చు.  ఈ తర్క శాస్త్రంలో Law of Excluded Middle ఏమి చెబుతుందంటే- ఒక వస్తువు ఒకే సమయంలో ఒక గుణం కలిగి మరియు అదే గుణం లేకుండా వుండజాలదు.  ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదనలకు అన్వయించినపుడు, ఎదైన ప్రతిపాదన నిజం లేక అబద్ధం అవునుగాని ఒకే సమయంలో ఒకే రీతిగా అది రెండూ (నిజం మరియు అబద్ధం) కానేరదు.

"దేవుడున్నాడు" అనే వాక్యం ఒక కచ్చితమైన ప్రతిపాదన కాబట్టి ఇది సత్యం లేక అసత్యం అయ్యుండాలి కాని రెండూ కానేరదు. దేవుడున్నాడు లేక లేడు- ఈ రెండిటిలో ఒకటే నిజం, రెండు పరిణామాలు సాధ్యం కాదు, మధ్యేమార్గం లేదు! నాస్తికుడేమో దేవుడు లేడని కుండబద్దలు కొట్టినట్లు చెబుతాడు; ఆస్తికుడు దేవుడున్నాడని అంతే రూఢిగా చెబుతాడు; ప్రత్యక్షవాదేమో (agnostic) దేవుడున్నాడని రుజువు చేయడానికి సరైన లేక సరిపోయినన్ని ఆధారాల్లేవు అంటాడు; చార్వాకుడేమో (skeptic) దేవుడున్నాడని రుజువు చేయడం అసాధ్యం అంటాడు. ఎవరిని నమ్మాలి? ఏది నిజం? దేవుడున్నాడా లేడా? 

ఈ ప్రశ్నకు సమాధానం- మనం అధారాలను పరిశీలించాల్సిందే. దేవుడున్నట్లైతే, ఆయన ఉనికికి సంబంధించిన అధారాల్ని మనకు అందుబాటులో కచ్చితంగా ఉంచివుండాలి. అటువంటి ఆధారం ఒక్కటైనా వుందా? వుంటే అసలు అదేమిటి? దాని స్వభావమేమిటి? 

ఆస్తికుడు, దేవుడున్నాడు అనడానికి బలమైన అధారాలున్నాయి అని వాదిస్తాడు. దేవుని ఉనికిని గూర్చి ఎటువంటి సందేహం లేదని చెబుతాడు. అయితే, ఒక సంచిలో ఒక కిలో కూరగాయలున్నాయి అని కొలిచి లేక గుండెలో నాలుగు గదులున్నాయి అని శాస్త్రీయంగా ఎలా రుజువు చేయగలమో అలా దేవుడున్నాడని రుజువు చేయడం సాధ్యమేనా? ఇది సాధ్యం కాక పోవచ్చేమో1 ఎందుకంటే కూరగాయల బరువు, గుండెలో గదులు వంటివి మన పంచేద్రియాల ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన విషయాలు. అయితే ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా రుజువు చేయడం నిస్సందేహంగా సరైనా విధానం కాని ఇదొక్కటే మార్గం మాత్రం కాదు. ఉదాహరణకు, ఒక విషయానికి రుజువుగా న్యాయవిభాగంలో ప్రాథమిక సాక్షాన్ని (prima facie) పరిగణలోకి తీసుకొంటారు. కాబట్టి ఒక ఆస్తికుడు కూడా దేవుడున్నాడనడానికి ప్రాథమిక అధారాలను (prima facie case) రుజువుగా తెలుపుచున్నాడు. అయితే వీటితో ఏకిభవించకపోతే దానికి తగిన వాదాన్ని నాస్తికులు లేక వ్యతిరేకులు వినిపించాలి. ఇక్కడ ఈ ఆస్తిక వాదం మీముందుచబడును. దానిని పరిశీలించి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

No comments:

Post a Comment